Deuteronomy 31

1మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడిన తరువాత మళ్ళీ ఈ మాటలు చెప్పాడు, నాకు ఇప్పుడు 120 ఏళ్ళు. 2ఇకనుంచి నేను అటూ ఇటూ వస్తూ పోతూ ఉండలేను. యెహోవాా నాతో ఈ యొర్దాను నది దాటకూడదు అని చెప్పాడు. 3మీ యెహోవాా దేవుడు మీకు ముందుగా దాటిపోయి ఈ రాజ్యాల్ని మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తాడు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవాా చెప్పినట్టుగా యెహోషువ మీకు ముందుగా దాటిపోతాడు.

4యెహోవాా నాశనం చేసిన అమోరీయుల రాజులు సీహోను, ఓగుకూ, వారి దేశాలకూ ఏమి జరిగించాడో అలానే వారికీ చేస్తాడు. 5మీరు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవాా మీ చేతికి వారిని అప్పగిస్తాడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారిపట్ల చెయ్యండి. 6నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవాా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.

7మోషే యెహోషువను పిలిచి, నువ్వు నిబ్బరంగా, ధైర్యంగా నిలబడు. యెహోవాా ఈ ప్రజలకిస్తానని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వీరితోబాటు వెళ్లి దాన్ని వారికి స్వాధీనం చెయ్యాలి. 8నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు.

9మోషే ఈ ధర్మశాస్త్రాన్ని రాసి, యెహోవాా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులకూ ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ ఇచ్చాడు. 10మోషే వారికిలా ఆజ్ఞాపించాడు, ప్రతి ఏడవ సంవత్సరంలో అంటే అప్పులు రద్దు చేసే ఆ నిర్ణీత గడువు సంవత్సరంలో పర్ణశాలల పండగ సమయంలో 11మీ దేవుడైన యెహోవాా ఎన్నుకున్న స్థలంలో ఇశ్రాయేలు ప్రజలంతా ఆయన ఎదుట కనబడాలి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వారికి వినిపించాలి.

12మీ యెహోవాా దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ విని, వాటి ప్రకారం నడుచుకునేలా ప్రజలను సమకూర్చాలి. పురుషులనూ స్త్రీలనూ పిల్లలనూ మీ పట్టణాల్లో ఉన్న పరదేశులను పోగు చెయ్యాలి. 13అలా చేస్తే, ఆ వాక్యాలు ఎరగనివారి పిల్లలు వాటిని విని, మీరు స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటబోతున్న దేశంలో మీరు జీవించే రోజులన్నీ మీ యెహోవాా దేవునికి భయపడడం నేర్చుకుంటారు.

14యెహోవాా, మోషేతో ఇలా చెప్పాడు. <<చూడు. నువ్వు తప్పకుండా చనిపోయే రోజు వస్తుంది. నువ్వు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలు ఇవ్వడానికి సన్నిధి గుడారంలో నిలబడండి.>> 15మోషే, యెహోషువలు సన్నిధి గుడారంలో నిలబడ్డారు. యెహోవాా మేఘస్తంభంలో నుండి గుడారం దగ్గర కనిపించాడు. ఆ మేఘస్తంభం గుడారపు ద్వారం పైగా నిలిచింది.

16యెహోవాా మోషేతో ఇలా అన్నాడు, <<చూడు. నువ్వు చనిపోయి నీ పితరుల వద్దకు చేరుకోబోతున్నావు. ఈ ప్రజలు బయలుదేరి ఏ దేశ ప్రజల మధ్య ఉండబోతున్నారో ఆ ప్రజల మధ్య, ఆ అన్య దేవుళ్ళను అనుసరించి వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసిన నిబంధన మీరతారు.

17అప్పుడు వారిమీద నా కోపం రేగుతుంది. నేను వాళ్ళని వదిలిపెడతాను. వారికి నా ముఖం చాటు చేస్తాను. వాళ్ళు నాశనమైపోతారు. ఎన్నో విపత్తులూ కష్టాలూ వాళ్లకు సంభవిస్తాయి. ఆ సమయంలో వాళ్ళు, మన దేవుడు మన మధ్య లేనందువల్లనే మనకు ఈ విపత్తులు వచ్చాయి గదా! అనుకుంటారు. 18వాళ్ళు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి, చేసిన దుర్మార్గమంతటిబట్టి ఆ రోజు నేను తప్పకుండా వారికి నా ముఖం చాటు చేస్తాను.

19కాబట్టి మీరు ఈ పాట రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పండి. ఈ పాట ఇశ్రాయేలు ప్రజల మీద నీకు సాక్ష్యంగా ఉండేలా దాన్ని వారికి కంఠస్తం అయ్యేలా నేర్పించండి. 20నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించిన తరువాత వారు తిని తాగి తృప్తిపొంది అహంకారం తెచ్చుకుంటారు. ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని పూజించి నన్ను విడిచిపెట్టి నా నిబంధన మీరతారు.

21ఎన్నో ఆపదలూ కష్టాలూ వారికి సంభవిస్తాయి. అప్పుడు ఈ పాట వారి ఎదుట సాక్షిగా నిలబడి సాక్ష్యమిస్తూ ఉంటుంది. ఆ పాట మరచిపోకుండా ఉండేలా వారి సంతానానికి కంఠోపాఠంగా ఉంటుంది. ఎందుకంటే, నేను ప్రమాణం చేసిన దేశంలో వాళ్ళను నడిపించక ముందే, ఈనాడే వాళ్ళు జరిగించే ఆలోచన నాకు తెలుసు>> అన్నాడు.

22మోషే ఆ రోజు ఈ పాట రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాడు. 23యెహోవాా నూను కొడుకు యెహోషువకు ఇలా చెప్పాడు. <<నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వాళ్ళని నడిపించాలి. నేను నీకు తోడుగా ఉంటాను.>>

24మోషే ధర్మశాస్త్ర వాక్యాలన్నీ గ్రంథంలో పూర్తిగా రాయడం ముగించిన తరువాత 25యెహోవాా నిబంధన మందసాన్ని మోసే లేవీయులను చూసి మోషే ఇలా ఆజ్ఞాపించాడు, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని మీ యెహోవాా దేవుని నిబంధన మందసం పక్కన ఉంచండి. 26అది అక్కడ మీమీద సాక్షిగా ఉంటుంది.

27మీ తిరుగుబాటుతత్వం, మీ తలబిరుసుతనం నాకు తెలుసు. ఇవ్వాళ నేను ఇంకా జీవించి మీతో కలిసి ఉండగానే మీరు యెహోవాా మీద తిరుగుబాటు చేశారు. 28నేను చనిపోయిన తరువాత ఇంకా ఎక్కువ తిరుగుబాటు చేస్తారు కదా! మీ గోత్రాల పెద్దలందరినీ, మీ అధికారులనూ నా దగ్గరకు తీసుకురండి. ఆకాశాన్నీ భూమినీ వారిమీద సాక్షంగా పెట్టి నేనీ మాటల్ని వాళ్ళు వినేలా చెబుతాను.

29ఎందుకంటే నేను చనిపోయిన తరువాత మీరు పూర్తిగా చెడిపోయి నేను మీరు పాటించాలని ఆజ్ఞాపించిన మార్గం తప్పిపోతారని నాకు తెలుసు. ఆయన దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి, మీరు చేసే పనులతో యెహోవాాకు కోపం పుట్టిస్తారు. రాబోయే రోజుల్లో విపత్తులు మీకు కలుగుతాయి.

తరువాత మోషే ఇశ్రాయేలు ప్రజలు వింటుండగా ఈ పాట పూర్తిగా పాడి వినిపించాడు.

30

Copyright information for TelULB